ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

లక్నో : ఉన్నావ్‌ అత్యాచారం, హత్య ఘటనలోని బాధితురాలి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బీజేపీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ఉన్నావ్‌ ఎంపీ సాక్షి మహారాజ్‌తో కలిసి శనివారం బాధితురాలి కుటుంబ సభ్యలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఉన్నావ్‌ బాధితురాలు మరణం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. దోషులందరికీ కఠిన శిక్ష విధిస్తామన్నారు.



ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుంచి మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇ‍వ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం ఆదిత్యానాథ్‌తోపాటు ప్రభుత్వం బాధితురాలికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని, ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. కాగా గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణం జరిగినా  బీజేపీ ప్రభుత్వ సరిగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జరిగిన ఘోరమంతా జరిగాక ఏం చేసినా ఏం లాభమని విమర్శలు గుప్పిస్తున్నారు.